స్పోర్ట్స్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. లాహోర్ వేదికగా ఇవాళ ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించగా, మొత్తం 4 పాయింట్లతో ఆసీస్ సెమీస్‌కు చేరింది.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యఛేదనలో 12.5 ఓవర్లకు 109/1తో పటిష్ఠంగా నిలిచిన ఆసీస్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. ట్రావిస్ హెడ్ 59, స్టీవ్ స్మిత్ 19 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ప్రారంభమైంది.
వర్షం కొనసాగుతుండటంతో, డీఎల్ఎస్ పద్ధతి ద్వారా ఫలితం ప్రకటించే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది.
ఇక ఆఫ్ఘనిస్థాన్‌కు సెమీఫైనల్ అవకాశాలు ఇంకా ఉన్నాయి. రేపు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఇంగ్లండ్ 207 పరుగుల తేడాతో గెలిస్తే, ఆఫ్ఘన్ జట్టు అదృష్టవశాత్తూ సెమీస్‌కి వెళ్లే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించగా, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. రేపటి మ్యాచ్ ఫలితంపై అందరి దృష్టి పడింది.