లండన్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు ఈ సారి ఘోర అవమానం తప్పదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. ఈ టూర్ లో ఆసీస్‌పై టీమిండియా ఏ ఒక్క సిరీస్‌ను కూడా గెలుచుకునే అవకాశం లేదని ఎద్దేవా చేశాడు. ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి చెందడాన్ని ప్రస్తావిస్తూ మిగతా మ్యాచ్‌ల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందని విమర్శించాడు.
పేలవమైన ఫీల్డింగ్ మరియు బౌలింగ్‌తో టీమిండియా ఆసీస్‌పై సిరీస్‌లను గెలవలేదన్నాడు. ఈ మేరకు ట్వీటర్ వేదికగా వాన్ స్పందించాడు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆసీస్ తొలి వన్డేలోనే తన సత్తా చాటిందన్నారు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో మొత్తానికి ఆసీస్‌దే పైచేయి అవుతుందని ఆయన జోస్యం చెప్పాడు.
ఆసీస్ పర్యటనలో కోహ్లి టీంకు చుక్కెదరవడం ఖాయమన్నాడు. ఇప్పటికీ టీమిండియా ఐదుగురు స్పెషలిస్టు బౌలర్ల గురించి ఆలోచించడం ఆ జట్టు ఇంకా ‘ ఓల్డ్ స్కూల్’ లో ఉన్నట్లే కనబడుతుందని అన్నాడు. ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో ఆడితే కింది స్థాయిలో తగినంత బ్యాటింగ్ ఉండదనే విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించాడు.
కరోనా కారణంగా తొమ్మిదినెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన టీమిండియా, ఆస్ట్రేలియా గడ్డపై ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. అయితే, టీమిండియా తొలి వన్డేలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. బ్యాటింగ్‌లో కాస్త ఫర్వాలదేనిపించిన భారత్, బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది.
భారత్ బౌలింగ్, ఫీల్డింగ్ తప్పిదాలతో ఆసీస్ 374 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. ఫించ్, స్మిత్‌లు శతకాలు సాధించారు. ఇది ఆసీస్‌కు వన్డేల్లో భారత్‌పై అత్యధిక స్కోరు. కాగా, టీమిండియా బ్యాటింగ్‌లో హార్దిక్(90), శిఖర్ ధావన్(74)లు రాణించినా మిగతా వారు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో టీమిండియా 66 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.