హైదరాబాద్ : ఏవియేషన్, డిఫెన్స్ రంగాల్లో భారతదేశం అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా అవతరిస్తోంది. విమానయాన రంగంలో అతివేగంగా ఎదుగుతున్న ప్రపంచ దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. మిలటరీ ఆధునీకరణకు వచ్చే ఐదేళ్లలో రూ.9.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు కుడా సిద్ధం చేసింది.
విమానయాన, రక్షణ రంగంలో పేరొందిన పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణకు రాష్ట్రానికి రావడంతో ఇప్పుడు రాష్ట్రం ‘ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్’గా మారనుంది. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్, టాటా, ప్రాట్ విట్నీ, జీఈ, కొలిన్స్ ఏరోస్పేస్, ఐఏఐ, థేల్స్, ఆదాని, రఫేల్ వంటి సంస్థలు రాష్ట్రం లో ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టాయి.
కాగా రాష్ట్రంలో వివిధ ఏరోస్పేస్ పార్కుల్లో స్థలం కేటాయింపు, టీఎస్‌ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు, రూ.200 కోట్లకు పైబడిన పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు రాయితీలు తదితరాలపై ప్రత్యేక ఏరోస్పేస్, డిఫెన్స్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విమానయాన, రక్షణ పరికరాల ఉత్పత్తులకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ సంస్థలతో భాగస్వామ్యం కూడా ఇటివలే కుదుర్చుకుంది.
ప్రఖ్యాత శిక్షణ సంస్థలైన ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ (యూఎస్), క్రేన్‌ఫీల్డ్ యూనివర్సిటీ (యూకే), ఏరో క్యాంపస్ అక్వెంటైన్ (ఫ్రాన్స్) భాగస్వామ్యంతో అందరికీ అందుబాటులో ఉండే ఫీజుతో ఏరోస్పేస్, డిఫెన్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.
మౌలికవసతుల పరంగా చూస్తే రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ఏరోస్పేస్ పార్కులతో పాటు, రెండు హార్డ్‌వేర్ పార్కులు, 50 జనరల్ ఇంజనీరింగ్ పార్కులు ఉన్నాయి. వీటితో పాటు పలు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కులు, టెక్నాలజీ పార్కులు, ఎస్‌ఈజెడ్‌లు కూడా ఏవియేషన్, డిఫెన్స్ రంగాల అవసరాలను తీరుస్తున్నాయి.