కడప: వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎదుర్కొంటున్న వివాదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆయన బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండటం, పలు ఆరోపణలు ఎదుర్కోవడం తెలిసిందే.
తాజాగా, టీడీపీ నేత బీటెక్ రవి అవినాష్ రెడ్డిపై భూకబ్జాల ఆరోపణలు చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది.
బీటెక్ రవి చెప్పిన వివరాల ప్రకారం, అవినాష్ కుటుంబ సభ్యులు తొండూరు మండలంలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ఒక్కో ఎకరానికి కేవలం ₹50,000 మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారని తెలిపారు.
అంతేకాకుండా, దేవిరెడ్డి శంకర్ రెడ్డి 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, పులివెందుల మున్సిపల్ చైర్మన్ డికెటి కూడా భూకబ్జాలకు పాల్పడినట్లు బీటెక్ రవి ఆన్‌లైన్ ఆధారాలతో వెల్లడించారు.
ఈ వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపి, వీటి పై విచారణ జరిపించాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. నాటి వైసీపీ హయాంలో జరిగిన భూకబ్జాలను తక్షణమే రద్దు చేసి, భూములను ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని కోరారు. ఈ ఆరోపణలపై అవినాష్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.