హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌పై భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పేరును తొలగించాలన్న హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ ఆదేశాలు వివాదంగా మారాయి. జస్టిస్ ఈశ్వరయ్య జారీ చేసిన ఆదేశాలపై అజహర్ తీవ్రంగా స్పందిస్తూ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. “ఇది వ్యక్తిగత అవమానం, తప్పకుండా కోర్టుకు వెళతా” అని ఆయన స్పష్టం చేశారు.
అంబుడ్స్‌మన్ అభిప్రాయం ప్రకారం, అజహరుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తన పేరును స్టాండ్‌కు పెట్టించుకోవడం ‘విరుద్ధ ప్రయోజనాలు’ కిందకు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని అజహర్ తీవ్రంగా ఖండించారు. “ఇది స్థాయికి దిగజారడం కాదు, హైదరాబాద్‌లో క్రికెట్‌ను చూసి ప్రపంచం నవ్వుతోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
“17 ఏళ్ల క్రికెట్ జీవితంలో పదేళ్లపాటు దేశానికి కెప్టెన్‌గానూ సేవ చేశా. ఈ స్థాయిలో గౌరవించకపోవడం బాధాకరం” అని అన్నారు. తాను తప్పక కోర్టును ఆశ్రయిస్తానని, న్యాయం జరిగే నమ్మకముందని తెలిపారు.
ఇంతకుముందు వీవీఎస్ లక్ష్మణ్ పేరుతో ఉన్న స్టాండ్, అజహర్ హయాంలో మారింది. ఇప్పుడు మళ్లీ స్టాండ్ పేరును తొలగించాలన్న అంశం కొత్త దిశగా వెళ్లనుంది. ఐపీఎల్ టికెట్ వివాదం తర్వాత ఇప్పుడు మరో వివాదం హెచ్‌సీఏపై మరింత ఒత్తిడిని తెచ్చేలా ఉంది.