న్యూఢిల్లీ: కరోనా వైరస్ గత ఏడాది కాలంగా యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌కు సంబంధించి పలు రకాల వేరియంట్లే ప్రధాన కారణం అని, అవి చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా కడుతున్నారు.
భారతదేశంలోను ప్రస్తుతం అత్యంత వేగంతో వ్యాప్తి చెందుతున్న ఒక ప్రమాదకరమైన వేరియంట్ ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ అయిన సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఈ కారణం చేతనే దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ రూపాన ఇంత పెద్ద ఎత్తున విజృంభనకు కారణమని ఆమె చెప్తున్నారు.
ఇప్పుడు ఉన్న ఈ వేరియంట్ అన్ని రకాల వ్యాక్సిన్లనూ బోల్తా కొట్టించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఏఎఫ్‌పీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. కరోనాకు చెందిన బి.1.617 వేరియంట్ వల్ల ఈ విపత్తుకు కారణమని ఆమె స్పష్టం చేశారు. దీనిని తొలిసారి ఇండియాలో క్రితం ఏడాది అక్టోబర్‌లో గుర్తించారు. దీనిని ఒక ప్రత్యేకమైన వేరియంట్‌గా డబ్ల్యూహెచ్‌వో కూడా ఈ మధ్య లిస్ట్ చేసింది.
ఇంత వరకు కరోనా వ్యాప్తికి కారణమైన చాలా వేరియంట్లను గుర్తించామని, ఇదీ కూడా అందులో ఒక వేరియంట్ అని సౌమ్య తెలిపారు. సహజంగా లేదా వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన యాంటీబాడీలను కూడా ఈ వేరియంట్ బోల్తా కొట్టించే కొన్ని మ్యుటేషన్లు ఈ బి 1.617 వేరియంట్‌లో ఉన్నాయని సౌమ్య స్వామినాథన్ చెప్పారు.
అందువలన ఈ వేరియంట్ వ్యాప్తి విషయంలో చాలా ఆందోళన పడాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఈ వేరియంట్‌దే పుర్తి బాధ్యత అని చెప్పలేమని, కరోనా తగ్గుముఖం పట్టినా ప్రజలు బాధ్యతారహితంగా బయట తిరగడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడం, కట్టడికి నివారణ చర్యలను పాటించకపోవడం ఉధృతికి కారణంగా ఆమె తెలిపారు.