ముంబై: బాబా సిద్దిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శుభం లోంకార్ పరారీలో ఉండటంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ సంవత్సరం జూన్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల కేసులో కూడా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కానీ, ఏ ఆధారాలు లభించకపోవడంతో కేవలం ప్రశ్నించి వదిలేశారు.
శుభం లోంకార్, బాబా సిద్దిఖీ హత్య కేసులో అరెస్ట్ అయిన ప్రవీణ్ లోంకార్ సోదరుడే.
ప్రవీణ్‌ను ఆయుధాల చట్టం కింద అకోలా పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ, ఆ తర్వాత అతడికి బెయిల్ లభించింది.
శుభం లోంకార్‌కు జైల్లో ఉన్న ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
2018-19లో జైసల్మేర్‌లో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరీక్షలో శుభం పాల్గొన్నప్పటికీ, అర్హత సాధించలేకపోయాడు. ఆ తర్వాత ఆలోచనలన్నీ మారిపోయాయి.
కొద్దికాలంలోనే అతడు నేర కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ క్రిమినల్ ప్రపంచంలో అడుగుపెట్టాడు.
కాలేజీ మధ్యలోనే చదువు మానేసిన శుభం, తన సోదరుడు ప్రవీణ్‌తో కలిసి అనేక కేసుల్లో భాగమయ్యాడు.
శుభం లోంకార్‌పై ఇప్పటికే హిస్టరీ షీట్ ఉంది. ఈ ఏడాది జనవరిలో ప్రవీణ్‌ను అరెస్టు చేసినప్పటి నుంచి శుభం కూడా పోలీసులు నిఘాలో ఉన్నాడు.
అయితే, సెప్టెంబర్ 24 నుంచి శుభం కనబడకుండా పోయాడు.
అతడిని పట్టుకోవడం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో అతడి సంబంధాలు, నేర ప్రపంచంలో అతడి చురుకైన పాత్ర వల్ల, శుభం విచారణకు కీలక వ్యక్తిగా మారాడు.