ఇంటర్నేషనల్ డెస్క్: ఇజ్రాయెల్ సైన్యం ఆధ్వర్యంలో హమాస్ మిలిటెంట్ నేత యాహ్యా సిన్వర్ (61) హత్యతో పాలస్తీనా మద్దతుదారులలో తీవ్ర కలకలం రేగింది. హమాస్ కార్యకర్తలను భయపెట్టాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ విడుదల చేసిన దాడి అనంతర డ్రోన్ వీడియో ఇప్పుడు అటు ఆ సంస్థ సభ్యులలో కసిని, పోరాట స్ఫూర్తిని మరింతగా పెంచుతోంది. ఈ వీడియోకి సంబంధించి విశ్లేషకులు, ఇజ్రాయెల్ ఇలాంటి దృశ్యాలను విడుదల చేయడం భారీ తప్పిదమని అభిప్రాయపడుతున్నారు.
సిన్వర్ హత్య – డ్రోన్ వీడియో వైరల్
గాజాలోని ఓ భవనం పైకి చేసిన దాడిలో సిన్వర్ మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాలో విడుదల చేయగా, అది పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సిన్వర్ తీవ్రంగా గాయపడి తన చివరి క్షణాలు గడపడం కనిపిస్తుంది. అతని కుడి చేయి పూర్తిగా నుజ్జునుజ్జుగా మారి, దుమ్ము ధూళితో నిండిన భవనంలో ఒక సోఫాలో కూర్చొని ఉన్న అతను తన ఆఖరిక్షణాలలో కూడా శక్తివంచన లేకుండా శత్రువు డ్రోన్‌పై ఎడమ చేత్తో కర్ర విసరడం చాల మందిని విస్మయపరుస్తోంది.
ఇజ్రాయెల్ చెప్పినదంతా అబద్ధమే?
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో సిన్వర్ గాజాలోని సొరంగాల్లో దాక్కున్నాడని, అతని చుట్టూ భద్రతా సిబ్బంది దుర్భేద్యమైన రక్షణను కల్పించినట్లు ప్రకటించారు. కానీ, ఈ వీడియోలో సిన్వర్ భవనం లోపల ఉన్నట్లు స్పష్టమవుతోంది. రక్షణ వలయం లేకుండా, ఎలాంటి కవచం లేకుండా ఉన్న దృశ్యాలు ఇజ్రాయెల్ వాదనలన్నీ అబద్ధాలేనని రుజువు చేస్తున్నాయి.
పాలస్తీనా మద్దతుదారుల కన్నీటి ప్రవాహం
సిన్వర్ చివరి క్షణాల్లో తన పోరాటాన్ని కొనసాగించిన తీరు హమాస్ మద్దతుదారుల మనసులను ద్రవింపజేస్తోంది. సిన్వర్ సాహసోపేత పోరాటం, ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయినా శత్రువు ముందు తలవంచని తీరు పాలస్తీనా ప్రజలకు స్ఫూర్తిగా మారుతోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
వికటించిన వ్యూహం
సిన్వర్ వీడియో విడుదల ద్వారా హమాస్ మద్దతుదారులలో భయాందోళనలు కలుగజేసి వారి ఆత్మవిశ్వాసం దెబ్బతీయాలన్న ఇజ్రాయెల్ వ్యూహం పూర్తిగా బ్యాక్ ఫైర్ అయ్యిందా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
సిన్వర్ హత్య ఆపరేషన్ వెనుక కథ
ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన బిస్లామాచ్ బ్రిగేడ్ గాజాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులు కనిపించారు. సైనికుల కంట పడకుండా వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా, అప్పటికి ఇంకా గుర్తించని సిన్వర్ ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ సమాచారంతో ఆ ఇంటిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైన్యం ట్యాంకుతో దాడి చేసి భవనాన్ని పేల్చింది. తదనంతరం, శత్రువులు ఉనికిని నిర్దారించుకొనే క్రమంలో డ్రోన్ ను ఉపయోగించింది ఇజ్రాయెల్ సైన్యం. ఇది సోఫాలో రక్తమోడుతున్న ఒక వ్యక్తిని గుర్తించగా, అతను డ్రోన్ పై ఒక కర్రలాంటి వస్తువును విసిరడంతో పురాణాలు పోలేదు అని నిర్ధారణకువచ్చిన సైన్యం మరొకమారు ట్యాంకుతో కాల్పులు జరపగా అతను అక్కడే మరణించాడు. అతని మృతదేహం నుండి వేలిని కత్తిరించి, డీఎన్‌ఏ పరీక్ష ద్వారా అది సిన్వర్‌దేనని నిర్ధారించారు.