1974లో ‘తాత్తమ్మ కల’తో బాలనటుడిగా పరిశ్రమలోకి ప్రవేశించిన నందమూరి బాలకృష్ణ, ఈ ఏడాదితో తన 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సినిమా రంగంలో అర్ధ శతాబ్దం పైగా కొనసాగుతూ, ఇప్పటికీ స్టార్ హీరోగా వెలుగొందటం చిన్న విషయం కాదు.
ఈ సందర్భంగా టాలీవుడ్ తరఫున హైదరాబాద్‌లో సెప్టెంబర్ 1న ఘన సన్మానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వక్తలు రావడం, ప్రసంగాలు, పొగడ్తలు చెప్పడం లాంటివి కాకుండా, ఈ కార్యక్రమం చాలా వినూత్నంగా, ఎప్పటికీ నిలిచిపోయే రీతిలో గొప్పగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరధ మహారథులతో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.
కార్యక్రమం హైలైట్స్
అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ మేరకు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మరియు పలువురు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి హాజరు కాబోతున్నారని వినికిడి.
ఇండస్ట్రీ నుంచి చిరంజీవి లాంటి సీనియర్ స్టార్లతో మొదలుపెట్టి, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యూత్ హీరోల వరకు అందరికీ ఆహ్వానం వెళ్లబోతోంది. స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత మూడు సార్లు ఏకధాటిగా ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొందిన సినీ నటుడిగా, 100 రోజుల నుంచి వెయ్యి రోజులు ఆడిన బ్లాక్ బస్టర్ల హీరోగా ఎన్నో ఘనతలు సాధించిన బాలయ్య ఫ్యాన్స్‌కు చిరకాల జ్ఞాపకం ఇవ్వబోతున్నారు.
అభిమానుల సమకూర్పు
అభిమానులు భారీ ఎత్తున తరలి రాబోతున్నట్టు తెలిసింది. బాలయ్య బ్లాక్ బస్టర్ పాటలకు నృత్యాలు, ఆయన సాధించిన మైలురాళ్ళకు సంబంధించిన విశేషాలు, పాత కొత్త తరం హీరోయిన్లు ఎందరో పాలు పంచుకోబోతున్నారు.
విదేశాల్లో ఉన్న వాళ్ళను సైతం ప్రత్యేకంగా ఈ ఈవెంట్ కోసమే పిలిపించబోతున్నట్టు తెలిసింది.
109 సినిమాలు పూర్తి చేసుకోవడంతో పాటు, ‘ఆన్ స్టాపబుల్’ షో ద్వారా ఓటిటిలోనూ తనదైన ముద్ర వేసిన బాలకృష్ణతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు భారీ సంఖ్యలో ఈ వేడుకలో భాగం కాబోతున్నారు.
ఆహ్వాన పత్రికలు
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. బాలయ్య సినీ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా, ఆయా సినిమాల సన్నివేశాలతో ఆహ్వాన పత్రికలు రూపొందించబోతున్నారని తెలిసింది.