ఏపీ: టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ తన సినిమాలకు కొద్దిసేపు విరామం ఇచ్చి హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు.
నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా హిందూపురం అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ఇటీవల ప్రకటించిన రూ.12 వేల కోట్ల ప్యాకేజీపై హర్షం వ్యక్తం చేసిన బాలకృష్ణ, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రానికి రాజధాని అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్ వంటి ప్రాజెక్టుల్లో కేంద్రం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు.
హిందూపురం అభివృద్ధిపై మాట్లాడిన బాలకృష్ణ, ఇటీవలే రోడ్ల అభివృద్ధి కోసం రూ.92 కోట్లు విడుదల చేశామని, పనులు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు.
అలాగే, హంద్రీనీవా ప్రాజెక్టు మరమ్మతులకు కూడా నిధులు విడుదలైనట్లు చెప్పారు. ముఖ్యంగా చిలమత్తూరు గోరంట్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ప్రాధాన్యమని, గత వైసీపీ ప్రభుత్వ దిద్దుబాటు చర్యల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బాలకృష్ణ తన నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. అధికారి స్థాయి నుంచి పూర్తిగా సహకారం ఉంటే హిందూపురం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.