చెన్నై: దేశం మెచ్చిన గాయకుడు శ్రీ పండితారాద్యుల ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం. ఆయన కరోనా బారిన పడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రోజు రోజుకీ కోలుకుంటాడు అని ఎదురుచూస్తున్న అభిమానులు ఇంకా ఆయన ఆరోగ్యం విషమం గానే ఉందన్న విషయం జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన కోలుకోవాలని హీరోలు అభిమానులు గాయకులు ఈ సాయంత్రం దేవుడిని మూకుమ్మడిగా ప్రార్థించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ పిలుపు మేరకు ఈ ప్రార్థన జరిగింది.
బాలు కొడుకు ఎస్పీ చరణ్ తన తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి స్పందించారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా వణుకుతున్న గొంతుతో మాట్లాడారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో బాలు వెంటిలేటషన్ పైనే చికిత్స పొందుతున్నాడని తెలిపారు. నాన్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని చరణ్ అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని భావోద్వేగానికి గురయ్యారు. మీ ప్రార్థనలు నాన్నని తప్పకుండా బతికిస్తాయని చరణ్ తెలిపారు. ”సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు ఈ రోజూ నాన్న కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. వారందరికీ మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. నాన్న ఆరోగ్యం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. మేము ధైర్యంగా ఉన్నాం. భగవంతుడు ఉన్నాడు. నాన్నని కాపాడుతాడు” అంటూ చరణ్ వీడియోను విడుదల చేశారు.