బెంగళూరు: భారత దేశ ఐటీ రాజధాని అయిన బెంగళూరు నగరంలో మహిళల కంటే పురుషులకే అత్యధికంగా కరోనా వైరస్ సోకుతోందని తెలుస్తోంది. పురుషులు ముఖానికి మాస్క్ వినియోగించడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు మహిళలతో పోలిస్తే ఎక్కువగా బయట తిరుగుతారు కాబట్టి వారే కరోనా బారిన ఎక్కువగా పడుతున్నట్లు తెలుస్తోంది.
గడచిన ఆరు రోజులలో బెంగళూరు లో 3,364 మంది పురుషులకు, 2,334 మంది మహిళలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారం రోజుల నుంచి కర్ణాటకలో కరోనా రెండో ఉధృతి ప్రారంభమైందనడానికి సంకేతంగా రోజు దాదాపు 1500 లకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
కోవిడ్ నిబంధనలను మహిళల కంటే పురుషులే అధికంగా ఉల్లంఘిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలుస్తోంది. పబ్‌లు, రెస్టారెంట్లు, సభలు, సమావేశాలు, వివాహాలు, రెస్టారెంట్లలో ఎక్కువగా పురుషులే పాల్గొంటున్నారు. ఈ ఏడాది (2021) ఆరంభమైన తర్వాత తొలిసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేల మార్క్ దాటింది. గత వారం రోజులుగా వెయ్యి పైగా పాజిటివ్‌లు నిర్ధారిస్తున్నారు.
గతంలో 2020 నవంబరు 14వ తేదీన 2,154 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మార్చి 24వ తేదీన రెండు వేల మార్కు దాటింది. ఈ నెలారంభంలో 5,800గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య.. 23వ తేదీ నాటికి 15 వేలు దాటింది.