తెలంగాణ: కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో హెబ్బగోడి జీఎం ఫాం హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీ ఘటన మరోసారి కలకలం రేపుతోంది. 3 నెలల క్రితం నిర్వహించిన ఈ రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు.
విజయవాడకు చెందిన వ్యాపారి ఎల్. వాసు యాజమాన్యంలోని ‘విక్టరీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ’ వారి మొదటి వార్షికోత్సవాన్ని రేవ్ పార్టీగా మార్చినట్లు అధికారులు తేల్చారు. ఈ పార్టీలో పాల్గొన్న 88 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు.
ప్రముఖ తెలుగు నటి హేమతో సహా 79 మంది డ్రగ్స్ సేవించినట్లు అభియోగం నమోదు చేశారు. మొత్తం 1,086 పేజీల అభియోగ పత్రంలో ప్రతి నిందితుడి పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇటీవల నటి హేమ డ్రగ్స్ సేవించిందని బెంగళూరు పోలీసులు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ తీసుకున్నట్లు ఆధారాలు సేకరించి, మెడికల్ రిపోర్టులు జత చేశారు. 88 మంది నిందితులతోపాటు 79 మందిపై డ్రగ్స్ వాడకానికి సంబంధించి అభియోగాలు నమోదయ్యాయి.
హేమ ఈ కేసులో డ్రగ్స్ తీసుకోలేదని కోర్టుకు వాదనలు వినిపించి, మినహాయింపు కోరారు. కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణలో డ్రగ్స్ స్వాధీనం కానప్పటికీ, హేమ ఆ రాత్రి రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు ఆధారాలు అందజేశారు.
ఇరు పక్షాల వాదనల అనంతరం కోర్టు హేమకు బెయిల్ మంజూరు చేసింది, దీంతో ఆమె శుక్రవారం మధ్యాహ్నం పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలైంది.