స్పోర్ట్స్ డెస్క్: 2024-25 సంవత్సరానికి గాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ప్రకటించింది. మొత్తం 34 మంది ఆటగాళ్లకు నాలుగు కేటగిరీల్లో స్థానం లభించింది.
గత సంవత్సరం కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఈసారి మళ్లీ చోటు దక్కించుకోవడం విశేషం.
A+ కేటగిరీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా స్థానం సంపాదించారు. వీరికి రూ. 7 కోట్లు వార్షిక వేతనం అందుతుంది. టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ వీరి స్థానం కొనసాగడం ఆసక్తికరమైన పరిణామం.
A కేటగిరీలో మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషభ్ పంత్ ఉన్నారు. వీరికి రూ. 5 కోట్ల వేతనం లభిస్తుంది. B కేటగిరీలో సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.
C కేటగిరీలో యువ క్రీడాకారులకు పెద్దపీట వేయడం జరిగింది. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్, నితీశ్ కుమార్ రెడ్డి, రజత్ పాటీదార్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా మొదలైనవారికి తొలి సారి కాంట్రాక్టులు లభించాయి. వీరికి ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున వేతనం.
ఈ కాంట్రాక్టుల ద్వారా బీసీసీఐ కొత్త తరం ఆటగాళ్లను గుర్తించి, వారికి ప్రోత్సాహం కల్పించడమే కాకుండా, మంచి ఫ్యూచర్ ప్లానింగ్‌కి నాంది పలికినట్టైంది.