న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫ్యాన్స్ కి బీసీసీఐ శుభవార్త తెలిపింది. తమ అభిమాన క్రికెటర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 100 టెస్ట్‌ను స్టేడియంలో నుండి చూసి ఆనందించడానికి బీసీసీఐ అనుమతిచ్చింది.
ఈ నెల 4వ తేదీ నుండి మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్ కోహ్లి కెరీర్‌లో వందో మ్యాచ్ అవడంతో స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. కాగా మ్యాచ్ కు టికెట్లన్నీ ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయిస్తామని పేర్కొంది.
బీసీసీఐ ప్రకటనతో కోహ్లి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి పోయారు. కరోనా వైరస్ నేపథ్యంలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతి ఇవ్వడం లేదని బీసీసీఐ తొలుత ప్రకటించింది. కాగా, కోహ్లికి కెరీర్లో చిరస్మరణీయంగా మిగిలిపోయే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతివ్వాలని అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది.