న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా భారత దేశవాళీ క్రికెటర్లకు పెద్ద శుభవార్త తెలిపారు. 2019-20 సీజన్‌కు గానూ దేశవాళి ఆటగాళ్ళు అందరికీ 50 శాతం అదనంగా మ్యాచ్ ఫీజును చెల్లించబోతున్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా 2020-2021 సీజన్ లో జరిగిన ఆర్థిక నష్టానికి గాను పరిహారంగా వారికి ఈ మేరకు అదనపు ఫీజు చెల్లించేందుకు నిర్ణయం బోర్డు తీసుకున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వారిలో 40 మ్యాచులకు పైగా ఆడిన సీనియర్లకు రూ. 60 వేలు, అండర్-23 ప్లేయర్లకు 25 వేలు, అండర్-19 క్రికెటర్లకు 20 వేల ప్రకారం ఫీజులను చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్విటర్ వేదికగా జై షా ప్రకటించారు. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల క్రిత సంవత్సరం జరగాల్సిన దేశవాళీ సహా వివిధ క్రికెట్ టోర్నీలు వాయిదా పడ్డాయి. దేశంలో వ్యాక్సినేషన్ వేగవంతం కావడం అలాగే కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల ఈ ఏడాది ఆరంభం నుంచి పలు క్రీడా ఈవెంట్లు కొద్దికొద్దిగా మొదలయ్యాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్-2021 యూఏఈ వేదికగా ఆదివారం ప్రారంభమయింది.