దుబాయ్: యూఏఈ లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణా బాధ్యతలు చూసుకుంటోన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక అధికారి ఒకరు తాజాగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
‘బీసీసీఐ బృందంలో ఒక పాజిటివ్ కేసు వెలుగు చూసింది. అతను వైద్య బృందం లేదా క్రికెట్ ఆపరేషన్స్ టీమ్‌కు చెందిన వ్యక్తా అనేది చెప్పలేం. ఇది మినహా మిగతా అంతా బాగుంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
కాగా సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ ఐపీఎల్–2020నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన వ్యక్తిగత కారణాలతో అతను ఆటకు దూరం కానున్నాడని సమాచారం. అధికారికంగా భజ్జీ దీనిని ధృవీకరించకపోయినా అతని తల్లి అనారోగ్యంతో ఉండటంతో యూఏఈ వెళ్లరాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారమే దుబాయ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సహచరులతో కలవాల్సి ఉండగా హర్భజన్ ఇప్పటి వరకు వెళ్లలేదు.
సెప్టెంబర్ 19నుంచి ఐపీఎల్ జరగాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఏ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. టోర్నీ షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేస్తామని బీసీసీఐ బోర్డు అధ్యక్షుడు, భారత్ టీం మాజీ కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.
‘షెడ్యూల్ ఇప్పటికే చాలా ఆలస్యం అయిందనేది వాస్తవం. దానికి తుది మెరుగులు దిద్దుతున్నాం. శుక్రవారం ప్రకటిస్తాం’ అని దాదా స్పష్టం చేశారు.