న్యూఢిల్లీ: క్రిత సంవత్సరం ఐపీఎల్ సీజన్ కోసం దుబాయ్ వెళ్లి వచ్చిన టీమిండియా ఆటగాళ్లు విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో కొందరు ఆటగాళ్లకు కాస్త విశ్రాంతి కల్పించాలని జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఇంగ్లండ్‌తో త్వరలో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, ఓపెనర్ అయిన రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్‌లతో సహా మొత్తం 8 మంది కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వబోతున్నట్లు సమాచారం.
కరోనా బ్రేక్ అనంతరం క్రికెట్ రిస్టార్ట్ అయినప్పటి నుంచి టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్‌కే పరిమితం కావడం వల్ల తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదమున్నందున ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్ కోసం దుబాయ్‌కు వెళ్లిన భారత ఆటగాళ్లు, అక్కడి నుంచే నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళారు. అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చాక స్వల్ప విరామం తరువాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సన్నదమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని భారత జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
స్పెషల్ రిక్వెస్ట్ మీద పేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఇదివరకే జట్టు నుంచి తప్పుకోగా తాజాగా మరికొందరు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించాలని టీం మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. బుమ్రా నాలుగో టెస్టు సహా వన్డే, టీ20 సిరీస్‌లకు సైతం దూరం కానున్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ మార్చి 23, 26, 28 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే.