బెంగళూరులోని వినియోగదారుల కోర్టు సినిమా ప్రదర్శనలో అధికంగా ప్రసారమయ్యే ప్రకటనల వ్యవహారంపై కీలక తీర్పు వెలువరించింది. 2024లో విడుదలైన సామ్ బహదూర్ సినిమా ప్రదర్శనకు ముందు 25 నిమిషాల పాటు వచ్చిన కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్స్ తన సమయాన్ని వృథా చేశాయని అభిషేక్ ఎం.ఆర్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. సినిమా సమయానికి మొదలుకాక, ఆలస్యం కావడం వల్ల తన పనులకు తీవ్ర అంతరాయం కలిగిందని పేర్కొన్నారు.
ఈ కేసులో కోర్టు థియేటర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సినిమా అసలు షో టైమ్‌ను టికెట్‌పై స్పష్టంగా చూపించాలని, ప్రేక్షకుల సమయాన్ని వృథా చేయడం అన్యాయమని వ్యాఖ్యానించింది. బుక్ మై షోకు ఈ వ్యవహారంలో బాధ్యతలేమీ లేవని పేర్కొన్నప్పటికీ, థియేటర్లు మాత్రం వాణిజ్య ప్రకటనలతో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం తగదని కోర్టు స్పష్టం చేసింది.
పీవీఆర్, ఐనాక్స్ తమ థియేటర్లలో ఆలస్యంగా వచ్చే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ప్రకటనల సమయాన్ని పెంచుతున్నామని వాదించాయి. అయితే ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. సమయానికి వచ్చిన ప్రేక్షకులకు 25 నిమిషాలు ప్రకటనలు చూడమని అనడం అన్యాయమని తీర్పు ఇచ్చింది.
దీంతోపాటు, పీవీఆర్, ఐనాక్స్‌లను అభిషేక్ ఎం.ఆర్‌కు ₹20,000 నష్టపరిహారం, కేసు ఖర్చుల కోసం ₹8,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అదనంగా, రూ.1 లక్షను శిక్షార్హమైన నష్టపరిహారంగా చెల్లించాల్సిందిగా స్పష్టమైన తీర్పునిచ్చింది.
ఈ తీర్పుతో థియేటర్ల ప్రకటనల వ్యవస్థపై మరింత కట్టుదిట్టమైన నియంత్రణలు అమలయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ప్రేక్షకుల హక్కులను పరిరక్షించే ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా థియేటర్లలో కొత్త మార్గదర్శకాలుకు దారితీసే అవకాశం ఉంది.