చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో రైతులు పిలుపునిచ్చిన మంగళవారం నాటి భారత్ బంద్ విజయవంతమైంది. రైతులు, విపక్ష పార్టీలు, వారి మద్దతుదారుల దేశవ్యాప్త నిరసన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, విజయవంతంగా ముగిసింది.
సామాన్య ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా నాలుగు గంటల పాటు(మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు) బంద్ నిర్వహించాలన్న రైతు సంఘాల పిలుపునకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా స్పందించారు. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో బంద్ 100% విజయవంతమైంది. ఒడిశా, మహారాష్ట్ర, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బిహార్‌ల్లోనూ బంద్ ప్రభావం అధికంగా కనిపించింది.
ఇంకా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రైతులకు మద్దతుగా వ్యాపారస్తులు వారి దుకాణాలను వారే స్వచ్చందంగా మూసి వేశారు. రైల్వే ట్రాక్స్‌ను, కీలక రహదారులను, చౌరస్తాలను నిరసనకారులు దిగ్బంధించారు. బంద్ విజయవంతమైందని, బంద్‌కు ప్రజలనుంచి లభించిన మద్దతు చూసిన తరువాతైనా తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించాలని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.
రైతులు చేసిన భారత్ బంద్ విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనూహ్యంగా స్వయంగా తానే రంగంలోకి దిగారు. ఆయన మంగళవారం రాత్రి రైతు సంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. ‘మరో మార్గం లేదు. వ్యవసాయ చట్టాల రద్దుకు ఒప్పుకుంటారా? లేదా అన్నదే షా ముందు మేం పెట్టే ఏకైక డిమాండ్’ అని షా తో చర్చలకు వెళ్లేముందు రైతు నేత రుద్రు సింగ్ తేల్చి చెప్పారు.