ఆంధ్రప్రదేశ్: భారీ ప్రాజెక్టుతో ఏపీకి భారత్ ఫోర్జ్
ఆంధ్రప్రదేశ్‌లో రక్షణ రంగంలో ఓ భారీ ప్రాజెక్టు ఆవిష్కరణకు భారత్ ఫోర్జ్ లిమిటెడ్ (Bharat Forge Ltd) ముందుకొచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంలో ప్రసిద్ధి గాంచిన ఈ సంస్థ, తన అనుబంధ సంస్థ కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ (Kalyani Strategic Systems Ltd – KSSL) ద్వారా రాష్ట్రంలో ఆధునిక డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, మందుగుండు సామగ్రి తయారీ యూనిట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసింది.
మడకశిర మండలం పరిధిలో గౌడనహళ్లి, ఆర్.అనంతపురం గ్రామాల్లో ప్రాజెక్టు కోసం భూమిని పరిశీలించిన సంస్థ, ప్రభుత్వానికి 2,400 కోట్ల పెట్టుబడులతో రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నట్లు ప్రతిపాదించింది.
ప్రాజెక్టు వివరాలు:
ఈ భారీ ప్రాజెక్టు రెండు దశల్లో అభివృద్ధి చేయబడుతుంది:
- మొదటి దశలో: రూ.1,000 కోట్ల పెట్టుబడితో ప్లాంటు ఏర్పాటుకు 1,000 ఎకరాల భూమి అవసరమని పేర్కొంది.
ఈ దశలో షెల్ ఫిల్లింగ్ యూనిట్, టీఎన్‌టీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఏటా 3,500 టన్నుల టీఎన్‌టీ, రెండు లక్షల ఫిరంగుల్లో మందుగుండు నింపే సామర్థ్యం కలిగిన యూనిట్లు ఏర్పాటవుతాయి.
రెండో దశలో: పాలిమర్ బాండెడ్ ఎక్స్‌ప్లోజివ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌తో పాటు, అడ్వాన్స్‌డ్ ఎనర్జిటిక్స్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయనుంది. దీనికోసం రూ.1,400 కోట్ల పెట్టుబడి నిర్దేశించింది.
ప్రాజెక్టు కాలప్రణాళిక:
- 2024: భూమి సేకరణ, భవిష్యత్ విస్తరణ అవసరాలకు భూముల గుర్తింపు
- 2025: షెల్ ఫిల్లింగ్ యూనిట్ & టీఎన్‌టీ తయారీ ప్లాంట్
- 2026: గన్ ప్రొపెల్లెంట్స్ యూనిట్
- 2027: పాలిమర్ బాండెడ్ ప్రొపెల్లెంట్స్ తయారీ యూనిట్
- 2029: రాకెట్ మోటార్ల కోసం కాంపోజిట్ ప్రొపెల్లెంట్స్ తయారీ
ప్రపంచవ్యాప్తంగా రక్షణ సామగ్రి డిమాండ్ పెరుగుతుండగా, ఈ ప్రాజెక్టు ద్వారా 550 మంది స్థానిక కార్మికులకు ఉపాధి లభిస్తుంది.
భారత్ ఫోర్జ్ రక్షణ సామగ్రిని దేశంలోనే కాకుండా విదేశాలకూ సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది.
2023లో ప్రపంచ ఆయుధ మార్కెట్ డిమాండ్‌లో 53 శాతం మందుగుండు సామగ్రి వాటాగా ఉందని సంస్థ పేర్కొంది.