మూవీడెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో కలిసి నటించి మెప్పించిన సినిమా ‘భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ అయిన మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించారు.
కాగా ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. గత నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ సరిగ్గా నెల రోజులకు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు రెడీ అయింది. నిజానికి ఈ చిత్రాన్ని మార్చి 25న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.
అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్ ను ఒక రోజు ముందుగానే చేయనున్నట్టు ఆహా నుండి అధికారిక ప్రకటన ఇచ్చింది. మార్చి 25న ఆర్‌ఆర్‌ఆర్ విడుదల కాబోతోన్న నేపథ్యంలో మార్చి 24వ తేదీనే తాము భీమ్లా నాయక్‌ను స్ట్రీమింగ్ చేయనున్నామంటూ ఆహా వెల్లడించింది.
దీనితో పాటూగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా ఈ చిత్రాన్ని మార్చి 24వ తేదీ నుండే స్ట్రీమింగ్ చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జోడీగా సంయుక్తా మీనన్ నటించిన సంగతి తెలిసిందే.