ఆంధ్ర ప్రదేశ్ లో ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం పెద్ద శుభవార్త అందించింది!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భవనాలు, లేఅవుట్ల అనుమతులను సులభతరం చేస్తూ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న స్థాయి భవనాల అనుమతుల కోసం ప్రజలు పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల చుట్టూ తిరగకుండా సులభతర విధానాన్ని ప్రవేశపెట్టింది. ఐదు అంతస్తుల భవనాల వరకు లైసెన్సుడ్ సర్వేయర్ల ద్వారా అనుమతులు ఇస్తుండటం దీనిలో ప్రధాన హైలైట్.
సింగిల్ విండో విధానం
డిసెంబర్ 31 నుంచి భవనాలు, లేఅవుట్ల అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. దీనిద్వారా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, అగ్నిమాపక, ఎయిర్‌పోర్టు వంటి అనుమతులన్నీ మున్సిపల్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అందుబాటులోకి వస్తాయి.
లైసెన్సుడ్ సర్వేయర్లకు బాధ్యత
ఐదు అంతస్తుల వరకు భవనాలకు లైసెన్స్డ్ సర్వేయర్లు అనుమతులను జారీ చేస్తారు. సర్వేయర్లు ప్లాన్‌లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి, డబ్బులు చెల్లించిన వెంటనే పర్మిషన్‌ను మంజూరు చేస్తారు. భవన నిర్మాణం ప్రారంభమైన తర్వాత పునాదుల దశ ఫొటోలు కూడా సర్వేయర్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
భవనాల సెట్‌బ్యాక్ పరిమితులు
పార్కింగ్, భవనాల ఎత్తు, సెట్‌బ్యాక్ పరిమితుల విషయంలో ముఖ్యమంత్రి ఆమోదించిన కొత్త మార్గదర్శకాలు ఉన్నతమైన నిర్మాణాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తాయి. 120 అడుగుల కంటే ఎత్తయిన భవనాల సెట్‌బ్యాక్‌ను 20 మీటర్లకు కుదించారు. 10 అంతస్తుల కంటే ఎత్తైన భవనాల్లో రిక్రియేషన్ కోసం ఒక అంతస్తు కేటాయించడం కూడా కీలక నిర్ణయంగా ఉంది.
టీడీఆర్ బాండు అవసరం లేదు
రహదారుల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండు లేకుండానే అదే ప్రాంతంలో అదనపు అంతస్తుల నిర్మాణ అనుమతిని ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇతర ప్రాంతాల్లో అదనపు నిర్మాణాల కోసం టీడీఆర్ బాండు తప్పనిసరి.
ప్రజల సంక్షేమంపై దృష్టి
ఈ కొత్త విధానంతో అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలకు సులభతర మార్గాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.