హైదరాబాద్: మలక్‌పేట శిరీష హత్య కేసులో పెద్ద ట్విస్ట్
హత్యగా మారిన వివాహిత మృతి కేసు
హైదరాబాద్ మలక్‌పేటలో వివాహిత శిరీష మృతి కేసు విచారణలో ఊహించని మలుపు తిరిగింది. మొదట సహజ మరణంగా భావించిన ఈ ఘటనలో, ఆమెను భర్త వినయ్ సోదరి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు వినయ్ తన సోదరితో కలిసి కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఊపిరాడకుండా చేసి హత్య
పోలీసుల సమాచారం ప్రకారం, శిరీషకు ముందుగా మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేశారు. ఈ సంఘటనలో ప్రధాన సూత్రధారి వినయ్ సోదరిగా పోలీసులు గుర్తించారు. హత్యలో పాత్ర ఉన్నట్టు తేలడంతో, వినయ్‌తో పాటు అతడి సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమ వివాహం.. కుటుంబ విభేదాలు
హనుమకొండ జిల్లా పరకాకు చెందిన శిరీష చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమెను కరీంనగర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ దత్తత తీసుకున్నారు. 2016లో నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్‌ను శిరీష ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ప్రొఫెసర్ కుటుంబం ఒప్పుకోకపోవడంతో, వారు శిరీషను దూరం పెట్టారు.
పెళ్లి తర్వాత కలతలు.. వేధింపులు
వివాహం అనంతరం కొంతకాలం సజావుగా సాగిన ఈ బంధం, ఆనతి కలం లోనే విభేదాలతో నిండిపోయింది. 2019లో పాప జన్మించినా, వినయ్ భార్యపై అనుమానంతో వేధించేవాడని పోలీసుల విచారణలో తేలింది.
వ్యూహం రచించిన నిందితులు
ఈ నెల 2వ తేదీన ఉదయం 10 గంటలకు వినయ్, తన భార్య గుండెపోటుతో మరణించిందని ఆమె సోదరి స్వాతికి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె మేనమామ మధుకర్‌కు విషయాన్ని చెప్పింది. మధుకర్ శిరీష ఫోన్‌కు కాల్ చేయగా, అటునుంచి ఓ మహిళ స్పందించింది. మధుకర్ తాను వచ్చేవరకూ మృతదేహాన్ని అక్కడే ఉంచాలని చెప్పారు.
అంబులెన్స్ ద్వారా మృతదేహం తరలింపు
అయితే, శిరీష హత్యను ఆచూకీ తెలియకుండా ఉంచేందుకు, ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తరలించే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి నుంచి అంబులెన్స్ డ్రైవర్ నంబర్‌ను తీసుకుని, అతనికి ఫోన్ చేసి సమాచారాన్ని అడిగినప్పుడు, మృతదేహం నాగర్‌కర్నూలుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.
పోలీసుల సత్వర చర్య.. మృతదేహానికి పోస్టుమార్టం
మధుకర్ వెంటనే పోలీసులను సంప్రదించగా, వారు సత్వరమే స్పందించి అంబులెన్స్‌ను దోమలపెంట వద్ద పోలీసులు ఆపించి, మృతదేహాన్ని నగరానికి రప్పించారు. తదనంతరం, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు.
పోస్టుమార్టం నివేదికలో హత్య ధృవీకరణ
పోస్టుమార్టం నివేదికలో శిరీష మెడ చుట్టూ గాయాలు ఉన్నట్లు, ఆమెను మత్తు మందు ఇచ్చి తర్వాత ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు తేలింది. ఆమె కుటుంబసభ్యులు వినయ్‌ను ప్రశ్నించగా, అతడు సంబంధం లేని సమాధానాలు ఇచ్చాడు. ముందుగా, ఆమె ఛాతీ నొప్పితో పడిపోయినప్పుడు సీపీఆర్ ఇచ్చానని, అందువల్లే గాయాలు అయ్యాయని చెప్పాడు. మరొకసారి, మృతదేహాన్ని తరలించే క్రమంలో కదిలించడమే గాయాలకు కారణమని తెలిపాడు. అయితే, పోలీసుల దర్యాప్తులో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు స్పష్టమైంది.