పట్నా: సాధారణంగా ఎన్నికల్లో గెలిపిస్తే అది ఉచితం ఇది ఉచితం అని హామీలు ఇస్తుంటారు రాజకీయ నాయకులు, ఇప్పుడు ఉచితంగా ఇవ్వడానికి ఒక కొత్త విషయం వచ్చేసింది. అదేంటో చూద్దాం.
బిహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని తెలిసిందే. ఇక్కడే ఆ కొత్త ఉచిత పథకం ప్రవేశపెట్టనుంది బీజేపీ పార్టీ. ఎన్నికలలో గెలిస్తే ప్రజలకు ఉచితంగా కోవిడ్–19 వ్యాక్సిన్‌ను అందిస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది.
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఐసీఎంఆర్ ఆమోదం లభించగానే కోవిడ్–19 వ్యాక్సిన్‌ను ఒకసారి ఉచితంగా అందిస్తామన్నారు. ‘‘కరోనాపై పోరాటంలో బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. కరోనా టీకా ఉచితంగా పంపిణీ చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. ఐసీఎంఆర్ వ్యాక్సిన్‌కి అనుమతినివ్వగానే ప్రజలకు ఉచితంగా అందిస్తాం’’ అని నిర్మలా సీతారామన్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పారు.
భారత్‌లో మూడు టీకాలు వివిధ దశల్లో ప్రయోగాల్లో ఉన్నాయని, అవి విజయవంతమైతే భారీగా టీకా డోసుల్ని ఉత్పత్తి చేయడానికి భారత్ సన్నద్ధంగా ఉందని అన్నారు. వ్యాక్సినేషన్‌కు అనుమతిరాగానే బిహార్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. కాగా కరోనా మహమ్మారిని అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఈ అంశంలో ఎన్నికల సంఘం పార్టీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవడానికి తమ రాష్ట్రానికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూడాలా అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆర్‌జేడీ, కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలన్నీ కోవిడ్ వ్యాధిని అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.