ముంబై : ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజా గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఇవాళ ఆరోపించారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిపై వ్యక్తిగత కక్ష పెంచుకుని, ఆయన పై కక్ష సాధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు.
ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ ఆత్మహత్య కేసులో నవంబర్ 4న అర్నబ్ అరెస్ట్ అయ్యారు. మేజిస్ట్రేట్ అర్నబ్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరిస్తూ నవంబర్ 18 వరకు జ్యూడీషియల్ రిమాండ్‌కు అనుమతించింది. అయితే హైకోర్టులో అర్నబ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను బెంచీ కొట్టివేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది.
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం సరిగా లేదని, ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. బిహార్‌లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించడంపై ఆయన పై విధంగా స్పందించారు. ఫడ్నవిస్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నందుకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఫలితం అనుభవిస్తుందని వ్యాఖ్యానించారు.
బిహార్ ఎన్నికలలో మోదీ ప్రచారం బీజేపీకి బాగా కలిసొచ్చిందని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. గ్రామ గ్రామానికి బీజేపీ అభివృద్ధి మంత్రం పనిచేసిందని అన్నారు. కాంగ్రెస్ చర్యలు భవిష్యత్తులో మహా రాజకీయాలను ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఆ ప్రభావం శివసేనపై పడుతుందని, ఇపుడు సేనకు అర్థం కాబోదని, వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో తగలబోయే ఎదురుదెబ్బతో తెలుస్తుందని ఫడ్నవిస్ జోస్యం చెప్పారు.