పట్నా: బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ఈ రోజు జరగనుంది. 71 అసెంబ్లీ స్థానాల్లో 1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని దాదాపు 2 కోట్ల మంది ఓటర్లు ఈ రోజు ఈవీఎంలలో బంధించనున్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలను సజావుగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.
ఒక్కొక్క పోలింగ్‌బూత్‌కు గరిష్టంగా ఉన్న ఓటర్ల సంఖ్యను కరోనా నేపథ్యంలో 1,600 నుంచి 1,000 కి కుదించింది. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించింది. ఈవీఎంలను కూడా తరచుగా శానిటైజ్ చేయనుంది.
ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి అందరికీ మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేసింది. అభ్యర్థుల్లో 952 మంది పురుషులు, 114 మంది మహిళలు ఉన్నారు. వీరిలో జేడీయూ తరఫున 35 మంది, బీజేపీ తరఫున 29 మంది పోటీ చేయనున్నారు. ఆర్జేడీ తరఫున 42 మంది, కాంగ్రెస్ తరఫున 20 మంది బరిలో దిగనున్నారు.
ఎల్జేపీ పార్టీ 41 చోట్ల పోటీ చేస్తుండగా, జేడీయూ పోటీ చేస్తున్న 35 చోట్లా అభ్యర్థులను నిలిపింది. కేబినెట్ మంత్రుల్లో 6 మంది ఈ దశలో బరిలో నిలిచారు. రెండో దశ పోలింగ్ నవంబర్ 3న, మూడో దశ పోలింగ్ నవంబర్ 7న, ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి.