ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. మూడేళ్లలో ఇది ఆయన మూడో పర్యటన కావడం విశేషం. ఈ విషయాన్ని తన లింక్డ్ ఇన్ ఖాతా ద్వారా వెల్లడించారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుండగా, ఈ సందర్భంగా ట్రస్టీల బోర్డు గ్లోబల్ సౌత్‌లో తొలి సమావేశాన్ని భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
భారతదేశం ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ రంగాలలో అద్భుత పురోగతి సాధిస్తోంది అని బిల్ గేట్స్ ప్రశంసించారు. పోలియో నిర్మూలన, హెచ్ఐవీ నివారణ, ఆరోగ్య కార్యక్రమాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆవాహన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.
గేట్స్ ఫౌండేషన్ ఇప్పటికే రెండు దశాబ్దాలుగా భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది. తక్కువ ఖర్చులో ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తేవడంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శిగా మారిందని అన్నారు.
డిజిటల్ విప్లవంలో యూపీఐ, ఆధార్, స్టార్టప్‌ల ప్రగతి ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని గేట్స్ తెలిపారు. భారతదేశం నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని, ఇది భవిష్యత్ ప్రపంచాన్ని మార్చే గొప్ప అవకాశం అని అభిప్రాయపడ్డారు.