వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచాంలో చాలా దెశాలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. భారత్‌తో సహా పలు దేశాల్లో ఇప్పటికే మనుషుల మీద ప్రయోగాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఫార్మా రంగాన్ని కొనియాడారు.
తమ దేశానికే కాక మొత్తం ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్‌లు ఉత్పత్తి చేయగల సత్తా భారత్‌కు ఉందని తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం భారత్‌లో ఇప్పటికే చాలా ముఖ్యమైన పరిశోధనలు జరిగాయని.. ఇతర వ్యాధుల కోసం ఉపయోగించిన పలు కాంబినేషన్‌లతో కరోనాకు వ్యాక్సిన్ రూపొందించడానికి భారత్ ఫార్మా కంపెనీలు కృషి చేస్తున్నాయని తెలిపారు.
‘ఇండియాస్ వార్ ఎగెనెస్ట్ ది వైరస్’ అనే డాక్యుమెంటరీలో మాట్లాడుతూ బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్ గేట్స్ ఈ సంధర్భంగా మాట్లాడుతూ ‘కరోనా ప్రభావం భారతదేశం మీద కూడా అధికంగానే ఉంది. ఎందుకంటే భారత్ లో జనాభా ఎక్కువ. అక్కడ పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత అధికంగా ఉంటుంది. భారతదేశంలో డ్రగ్, వ్యాక్సిన్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి.
భారత్‌లోని ఫార్మా కంపెనీలు ప్రపంచానికి అవసరమయిన వ్యాక్సిన్‌లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభమైన తర్వాత భారతదేశంలో ఉత్పత్తి అయినంత భారీగా వ్యాక్సిన్‌లు ప్రపంచంలో మరెక్కడా తయారు కాలేదు.
దీనితో పాటు బయో-ఈ, భారత్ బయోటెక్ వంటి ప్రసిద్ధ ఫార్మా కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. తమ ప్రజలకే కాక మొత్తం ప్రపంచానికి సరిపడా కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారత్ సొంతం’ అన్నారు బిల్ గేట్స్.
అంతేకాక భారత్ ‘కొయిలేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపరేడ్‌నెస్ ఇన్నోవేషన్స్’(సీఈపీఐ)లో చేరడం పట్ల గేట్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌లు తయారు చేసే కంపెనీల కూటమి.