హైదరాబాద్: దేశంలొ ఇప్పటికే కోవిడ్ కట్టడికి ఇప్పటికే దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను పంపిణీ చేస్తున్న భారత ప్రభుత్వం తాజాగా ఇంకో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త వ్యాక్సిన్ కూడా హైదరాబాద్కు చెందిన ఒక ఫార్మ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సినే అవడం పెద్ద విశేషం.
భారత కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా కంపెనీ బయోలాజికల్-ఈ ఎండీ మహిమా దాట్లతో సమావేశమయ్యారు. కాగా సదరు కంపెనీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోర్బివాక్స్ పురోగతి గురించి మహిమా దాట్ల ఆరోగ్య మంత్రికి పూర్తిగా వివరాలు తెలిపారు.
కాగా కోర్బివాక్స్ వ్యాక్సిన్ తయారీకి భారత ప్రభుత్వం సంపూర్ణ మద్దతి ఇస్తుందని కేంద్రమంత్రి బయోలాజికల్-ఈ కంపెనీ ఎండీకి హామీ ఇచ్చారు. ఇప్పటికే బయోలాజికల్-ఈ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలను చెల్లించింది.
ఈ నేపథ్యంలో బయోలాజికల్-ఈ ఎండీ మహిమా మాట్లాడుతూ, ‘‘మా వ్యాక్సిన్ ఉత్పత్తికి సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. ఈ నెల నుండే కోర్బివ్యాక్స్ ఉత్పత్తి ప్రారంభిస్తామని, ఈ సంవత్సరం డిసెంబర్లోగా కేంద్రానికి 30 కోట్ల డోసుల వ్యాక్సిన్లను అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.