కోల్‌కతా : మరి కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. దీదీ సర్కార్‌కు వ్యతిరేకంగా కరోనా వైరస్‌నూ బీజేపీ తన ప్రచార అజెండాలో ఒక అంశంగా సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు కోవిడ్-19 కేసులు పెరుగుతుంటే, కరోనా పోయింది అంటూ ఒక బీజేపీ అగ్రనేత పార్టీ ప్రచార ర్యాలీలో పేర్కొన్నారు.
బీజేపీ చేసే ర్యాలీలను అడ్డుకోవడానికే మమతా బెనర్జీ కరోనా వైరస్ సాకుతో అవసరం లేని లాక్‌డౌన్‌లు విధిస్తోందని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ గురువారం ఆరోపించారు. బెంగాల్‌లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకుండా బీజేపీని నిరోధించేందుకే దీదీ ఈ ఎత్తుగడ వేశారని, ఎవ్వరూ తమను ఈ విషయంలో అడ్డుకోలేరని ధనియకలిలో జరిగిన ప్రచార ర్యాలీలో ఘోష్ పేర్కొన్నారు.
భారత దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ కేసులు 45 లక్షల మార్క్‌ను దాటగా కేవలం బెంగాల్‌లోనే దాదాపు 2 లక్షల వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ను తేలిగ్గా తీసుకోరాదని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ గురువారం హెచ్చరించారు.
బీజేపీ అగ్రనేతలు సైతం కోవిడ్-19 నేపథ్యంలో ఆన్‌లైన్ ర్యాలీలకే పరిమితమవుతున్న నేపథ్యంలో దిలీప్ ఘోష్ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం. మరోవైపు బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా సైతం మమతా బెనర్జీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. అయోథ్యలో ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ సందర్భంగా ఆరోజు మమతా బెనర్జీ లాక్‌డౌన్ విధించారని విమర్శించారు. జులై 31న ఈద్ అల్ అదా సందర్భంగా నియంత్రణలను సడలించారని ఆరోపించారు. ఇది దీదీ హిందూ వ్యతిరేక, మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్టని నడ్డా విమర్శించారు.