ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల హామీలు వేడి రాజేస్తున్నాయి. ఈ పోరులో భాగంగా బీజేపీ తన రెండో సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయగా, విద్య, ఉపాధి, మహిళా సంక్షేమంపై కీలక హామీలను ప్రకటించారు.
తాము అధికారంలోకి వస్తే అర్హులైన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని బీజేపీ పేర్కొంది. అలాగే, పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సుల్లో చేరిన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు భీమ్ రావ్ అంబేద్కర్ స్టైఫండ్ కింద నెలకు రూ. 1,000 ఉపకార వేతనం అందిస్తామని హామీ ఇచ్చింది.
యూపీఎస్సీ, రాష్ట్ర సివిల్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ. 15 వేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది.
ఇదిలా ఉంటే, బీజేపీ తొలి మేనిఫెస్టోలో గర్భిణీ స్త్రీలకు రూ. 21 వేల ఆర్థిక సాయం, మహిళలకి నెలకు రూ. 2,500 అందించే మహిళా సమృద్ధి యోజన, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లను రూ. 500కే అందించాలన్న హామీలు ఉన్నాయి.
బీజేపీ తాజా హామీలపై ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందిస్తూ, తమ ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి ఉచిత విద్య లభిస్తోందని, బీజేపీ హామీ అర్హులకే పరిమితం చేస్తోందని విమర్శించారు. ఈ మాటల తూటాలతో ఢిల్లీ ఎన్నికల వేడి మరింతగా పెరుగుతోంది.