న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ మండికి చెందిన బీజేపీ ఎంపీ అయిన రామ్ స్వరూప్ శర్మ మరణం అనుమానాస్పదంగా ఉంది. ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఈ రోజు అనగా బుధవారం తన సొంత గృహంలో శవమై కనిపించారు. అయితే ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు.
ఆయన భార్య చార్‌ధామ్ యాత్రలో ఉండడంతో ఢిల్లీలోని నివాసంలో ఆయన ఒంటరిగానే ఉన్నారు. ఈ సమయంలో ఆయన అకాల మరణం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. శర్మ ఆకస్మిక మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా తన విచారం వ్యక్తం చేశారు.
ప్రధాని తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర సీనియర్లు, బీజేపీ శ్రేణులు ఎంపీ శర్మ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. దీంతో ఈ రోజు జరగాల్సిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని కూడా రద్దు చేశారు. నార్త్ అవెన్యూలోని తన నివాసంలో రామ్ స్వరూప్ శర్మ ఉరి వేసుకుని చనిపోయినట్టుగా తమకు సమాచారం అందిందని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
కాగా తమకు సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటు లాంటిది ఏమీ ఇప్పటివరకు లభించలేదన్నారు. విచారణ జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు బీజేపీ కేంద్ర మాజీమంత్రి దిలీప్ గాంధీ ఈ రోజు కరోనాతో కన్నుమూశారు. కాగా 1958 లో హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో జన్మించిన శర్మ 2014 లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో తిరిగి ఎన్నికయ్యారు.