న్యూఢిల్లీ : దేశంలోని ఒక సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జరిపిన ఒక అధ్యయనం ద్వారా భారత దేశంలోని రాజకీయ పార్టీలకు ఉన్న ఆస్తుల వివరాలను తాజాగా విడుదల చేసింది. అందులో అధికార భారతీయ జనతా పార్టీ 2900 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉంది.
మన దేశంలోని రాజకీయ పార్టీలు అన్నింటి ఆస్తుల మొత్తం విలువ దాదాపు 7,372 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఈ సంస్థ సర్వే తెలిపింది. ఈ ఆస్తుల విలువలో 7 జాతీయ పార్టీల ఆస్తుల మొత్తం 5349.25 కోట్ల కాగా, 2023.71 కోట్ల రూపాయలు ఆస్తులు 41 ప్రాంతీయ పార్టీలకు సంబంధించినవని తన నివేదికలో తెలిపింది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం బీజేపీ 2904.18 కోట్లుతో మొదటి వరుసలో నిలవగా, తరువాత కాంగ్రెస్ (ఐఎన్సీ) 928.84 కోట్ల రూపాయల ఆస్తులతో రెండు, బీఎస్పీ రూ. 738 కోట్లుతో మూడో స్థానంలో నిలిచాయి.
అయితే ప్రాంతీయంగా ఉన్న 41 రాజకీయ పార్టీల మొత్తం ఆస్తులు చూస్తే 2023.71 కోట్ల రూపాయలు కాగా అందులో 1921 కోట్ల రూపాయల ఆస్తులు మొత్తం కేవలం టాప్ 10 పార్టీల పేరిటనే ఉన్నాయి. కాగా ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాది పార్టీ 572.21 కోట్ల రూపాయలతో అగ్రస్థానంలో నిలిచింది.