హైదరాబాద్: హైదరాబాద్ గ్రేటర్ మునిసిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ టీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నుడుస్తోంది. బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధాధీరజ్‌రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. వరుసగా నాలుగుసార్లు కార్పొరేటర్‌గా గెలుపొందిన సీనియర్ నాయకుడు శంకర్ యాదవ్‌కు పార్టీ ఫ్లోర్‌లీడర్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోగా, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ఇటీవల మరణించారు. దీంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 47కు చేరింది. మరో రెండు ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా వారికే ఉన్నాయి. ఐతే అధికార టీఆర్‌ఎస్‌తో పోలిస్తే బీజేపీ బలం తక్కువగానే ఉంది. అయితే మేయర్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల నుంచి తమకు కొంత మంది సపోర్ట్ చేసే అవకాశం ఉందని, ఆ మేరకే పార్టీ అభ్యర్థిని మేయర్ బరిలో నిలిపినట్లు బీజేపీ స్పష్టం చేసింది.
ఇక టీఆర్ఎస్ నుండి జీహెచ్‌ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం కాసేపట్లో జరగనుంది. ఈ నేపథ్యంలో మేయర్ ఎవరన్నదానిపై సర్వత్రా చర్చలు జోరుగా సాగుతున్నాయి. అందరి దృష్టి బంజారాహిల్స్ కార్పొరేటర్‌పైనే నిలిచింది. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా రెండోసారి గెలిచిన గద్వాల్ విజయలక్ష్మికి మేయర్ పదవి వరించనుందనే వార్తలు గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ రోజు ఉదయం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ దాదాపు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసారని సమాచారం. దీంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని ఎన్‌బీటీనగర్‌లో ఆమె ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. కార్యకర్తలు, నేతల రాకపోకలతో కొత్త వాతావరణం కనిపిస్తోంది.