భోపాల్: దాదాపు ఒక సంవత్సర కాలం పైగా యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పీడిస్తూనే ఉంది. భారత్ లో మాత్రం కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో విలయ తాండవం చేస్తోంది. ఇంకా ఈ వైరస్ భారత్ ను వదలక ముందే, బ్లాక్ ఫంగస్ అంటూ ఇంకో మహమ్మారి గురించి చెప్పి శాస్త్రవేత్తలు ప్రజల నెత్తిన మరో బాంబు పెల్చారు.
ప్రజలు ఇప్పటికే ఆ బ్లాక్ ఫంగస్ గురించి భయపడ్తున్న తరుణంలోనే ఒకే వ్యక్తికి బ్లాక్‌తో పాటు వైట్ ఫంగస్ కూడా బయటపడ్డ కేసు ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దురదృష్టకర ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటు చేసుకుంది. ఈ పాటికే కొన్ని రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ భాయాందోళనలు రేపుతున్నాయి.
తాజాగా ఒక వ్యక్తిలోనే రెండు ఫంగస్‌లు ఉండడం అలజడి రేపుతోంది. ఇంత వరకు ఒక వ్యక్తిలో ఒక ఫంగస్‌ని మాత్రమే గుర్తించిన వైద్యులు ఆశ్చర్యంగా ఒకే వ్యక్తిలో రెండు రకాల ఫంగస్‌ను గుర్తించారు. కోవిడ్ బారిన పడి దాని నుంచి కోలుకున్న ఒక వ్యక్తికి బ్లాక్ ఫంగస్ తోపాటు వైట్ ఫంగస్ కూడా ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. దేశంలో ఈ తరహా కేసు ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
కాగా ఆ తర్వాత భోపాల్‌లో కూడా ఇలాంటి కేసు ఒకటి నమోదైందని తెలుస్తోంది. ఈ ఫంగస్ అడ్డకట్టకు ప్రభుత్వాలు కరోనా బారిన పడి కోలుకున్న వారిలో అధిక స్టెరాయిడ్స్ వాడిన వారిని గుర్తించే పనిలో పడ్డాయి. బ్లాక్ ఆండ్ వైట్ ఫంగస్ లు ముప్పు ఎక్కువగా కరోనా నుంచి కోలుకునే క్రమంలో అధికంగా స్టెరాయిడ్స్ వినియోగించిన వారిలో బయటపడుతున్నాయని పలువురు నిపుణులు అంటున్నారు. ఎక్కువగా స్టెరాయిడ్స్ వినియోగం వల్ల ఇమ్యూనిటీ పవర్ దెబ్బ తింటోందని దాంతోనే ఈ ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.