లండన్: ‘మేడిన్ ఇండియా’ హీరో సైకిల్ తొక్కి అందరిని ఆశ్చర్యపరిచారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. కరోనాపై పోరులో భాగాంగా ఒబెసిటీకి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రభుత్వం చేపట్టిన కొత్త జీబీపీ 2 బిలియన్ సైక్లింగ్, వాకింగ్ డ్రైవ్‌ను ప్రారంభించిన బోరిస్, దానిలో భాగంగా నాటింగ్‌హామ్‌లోని బీస్టన్ వద్ద ఉన్న హెరిటేజ్ సెంటర్‌లో సైకిల్ తొక్కారు.
బోరిస్ జాన్సన్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టమట. హెల్త్, ఫిట్‌నెస్ కోసం సైక్లింగ్ చేయడం చాలా మంచిదని ఆయన అన్నారు. బ్రిటన్‌లో కరోనా వైరస్ కారణంగా మృతి చెందుతున్నవారిలో చాలామంది స్థూలకాయులేనని, అధిక శరీర బరువు వల్ల వారు చనిపోతున్నారు అని కొందరు నిపుణులు ఇటీవల అభిప్రాయం వ్యక్తం చేశారు.
సైకిల్ తొక్కడాన్ని ఇష్టపడే బోరిస్, దేశం మొత్తం మీద వేల కిలోమీటర్ల బైక్ లేన్లను ఆవిష్కరించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఫిట్‌నెస్ స్ట్రాటజీలో భాగంగా ప్రభుత్వం సైకిల్ తొక్కేవారికి ప్రత్యేక లేన్ వేయనున్నట్లు తెలిపారు.
అంతేకాక నిత్య జీవితంలో సైక్లింగ్‌ను ప్రొత్సాహించడానికి గాను రవాణా కేంద్రాలు, పట్టణం, నగర కేంద్రాలు, ప్రభుత్వ భవనాల వద్ద మరిన్ని సైకిల్ రాక్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇళ్లలో పార్కింగ్ స్థలం లేని వారి కోసం వీధుల్లో రాక్‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సైక్లింగ్ వల్ల ఫిట్‌గా ఉండటమే కాక కాలుష్యం తగ్గటంతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరతాయన్నారు బోరిస్.