ఏపీ: వైసీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న టీడీపీ ప్రభుత్వం, తాజాగా బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో ఎదురుదెబ్బ తిన్నట్లు కనిపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన అనిల్, రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ, అక్కడే ఆయన వైసీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని తాజా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఫోన్ కూడా మాట్లాడనివ్వని పరిస్థితి, అనిల్ విషయంలో ఎలా మారిపోయిందని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ పాలనలో వైసీపీ అనుకూల అధికారులు ఇంకా ప్రభావం చూపుతున్నారని, వారు అనిల్‌కు సపోర్ట్ చేస్తూనే ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే నిజమైతే, అధికార యంత్రాంగంలో లుకలుకలు కొనసాగుతున్నాయనే అనుమానం కలుగుతోంది.
ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. జైలు అధికారులు, సంబంధిత అధికారుల్లో ఎవరి హస్తం ఉందనే దానిపై విచారణ జరుగుతోంది. అనిల్‌కు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు బయటపడితే, వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ వ్యవహారం టీడీపీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. అధికార వ్యవస్థ పూర్తిగా తమ చేతుల్లోకి రాకపోతే, పాలనలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతూనే ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.