బ్రిస్బేన్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఎదురు పోరాటం చేస్తోంది. 62 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడోరోజు ఆటను ప్రారంభించిన భారత్‌ను ఆసీస్ బౌలర్లను బోల్తా కొట్టించారు. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే సీనియర్ బ్యాట్స్‌మెన్ పుజారా (24)ను హెజిల్‌వుడ్ ఔట్ చేశాడు. ఆ తరువాత యువ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్‌తో జతకట్టిన కెప్టెన్ అజింక్యా రహానే జట్టును ముందుండి నడిపించాడు.
కాగా 100 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయిన టీంను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుండగా, 144 పరుగుల వద్ద రహానే (37) వెనుదిరిగాడు. ఆ తరువాత అగర్వాల్ (38) సైతం పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 161 పరుగులకు టీమిండియా ఐదు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత పంత్ కూడా 23 వికెట్ సమర్పించుకున్నాడు.
భారత బౌలర్లు శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ అద్బుతమైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నారు. 160 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్నారు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ ఠాకూర్ హాఫ్ సెంచరీ (54) సాధించాడు. ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో అదరగొట్టాడు. సుందర్ సైతం హాఫ్ సెంచరీకి సాధించి, టీంకు అండగా నిలిచాడు.