గుంటూరు: కరోనా కట్టడి కోసం దేశాంలో వేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వికటించడంతో గుంటూరులోని ఒక ఆశ కార్యకర్తకు బ్రెయిన్ డెడ్ అయినట్టు తెలియగా, మరో ఏఎన్‌ఎం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో కోలుకుంటోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి పీహెచ్‌సీ పరిధిలోని ఆరోగ్య కార్యకర్త (ఏఎన్‌ఎం) గొట్టిముక్కల లక్ష్మి (38), ఆశ కార్యకర్త బొక్కా విజయలక్ష్మి (42)కి ఈ నెల 20న కోవిడ్ వ్యాక్సిన్ వేశారు.
వ్యాక్సిన్ వేసుకున్న తరువాత ఏఎన్‌ఎం లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్ రాగా, విజయలక్ష్మి తలనొప్పి, మగత, వాంతులు వంటి లక్షణాలతో స్పృహ కోల్పోయింది. దీంతో వారిద్దరినీ ఈ నెల 22న గుంటూరు జీజీహెచ్‌లో చేర్చించారు. ఆందోళన వల్ల ఏఎన్‌ఎం లక్ష్మికి రియాక్షన్ వచ్చిందని, చికిత్స అందించిన వెంటనే సాధారణ స్థితికి చేరుకుని డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉందని జీజీహెచ్ వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండాగా ఆశ కార్యకర్త విజయలక్ష్మి మాత్రం బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్‌కు గురైనట్టు తేలింది. శనివారం రాత్రి ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్టు సమాచారం. అధికారికంగా ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా విజయలక్ష్మికి వేసిన వయల్ నుంచే మరో వైద్యుడికి టీకా వేసినా అతనికి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం గమనార్హం. డీఎంహెచ్‌వో డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్ జీజీహెచ్‌కు చేరుకుని వారిద్దరి పరిస్థితిపై ఆరా తీశారు.