హైదరాబాద్: అల్లరి నరేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘నాంది’. కామెడీ చిత్రాలతో ఎక్కువగా ఆకట్టుకునే అల్లరి నరేష్ అప్పుడపుడు తనలోని నటుడ్ని సంతృప్తి పరచడానికి కొన్ని సినిమాలు చేస్తుంటాడు. అలాంటి సినిమాలు చేసిన ప్రతీ సారి సినిమా ఫలితం ఎలాగున్నా కానీ నరేష్ మాత్రం ఆకట్టుకుంటాడు. ‘నేను’, ‘శంభో శివ శంభో’,’గమ్యం’… సినిమాలు ఆ కోవలోకే చెందుతాయి. ఇపుడు అలాంటి ప్రయత్నమే ‘నాంది’ సినిమా ద్వారా చేస్తున్నాడు. ‘ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్ పడుతుంది’ అంటూ విడుదల చేసిన ఫస్ట్ టీజర్ ఈ సినిమా పైన అంచనాల్ని పెంచింది. ఒక తప్పు చెయ్యని వ్యక్తి పోలీసుల చేత అరెస్ట్ చేయబడి న్యాయం కోసం వేచి చూసే ఒక సాధారణ పాత్రలో అల్లరి నరేష్ ఈ సినిమాలో నటించబోతున్నాడు.
బ్రీత్ అఫ్ నాంది పేరుతో ఇవాళ ఒక టీజర్ విడుదల అయింది. ’15 లక్షల మంది త్యాగం చేస్తే గాని మనకి స్వాతంత్య్రం రాలేదు.. 1300 మందికి పైగా బాలి దానం చేస్తే తప్ప మనకి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడలేదు.. ప్రాణం పోకుండా న్యాయం గెలిచినా సందర్భం చరిత్రలోనే లేదు.. నా ప్రాణం పోయిన పర్లేదు న్యాయం గెలవాలి’ అంటూ అల్లరి నరేష్ డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. ఇప్పటి వారికి విడుదలైన టీజర్ లో డైలాగ్స్ చాల బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి అబ్బూరి రవి మాటలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం తో ఆకట్టుకున్నాడు. విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్ధం అవుతుంది.