కోల్‌కతా: గతంలో పెళ్లి చూపులు అనగానే పెద్దలు ఒక మాట చెప్పేవారు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలి అని. అంటే ప్రతి విషయాన్ని పూర్తిగా ఆరా తీయాలని అనే వారు. అయితే కాలం మారుతున్న కొద్ది అన్ని విషయాల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లాయ్యక ఆడపిల్ల ఇంటి పట్టునే ఉండి, కుటుంబాన్ని చూసుకోవాలని అందరూ కోరేవారు. కానీ నేడు ఇద్దరు జాబ్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తనకు వధువు కావాలంటూ ఇచ్చిన ప్రకటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అతడి యాడ్ చూసిన వారంతా ‘నీకు ఈ జన్మలో పెళ్లి కాదు’ అని కుండ బద్దలు కొడుతున్నారు. మరి అంత వింత కోరిక ఏం కోరాడు అని ఆలోచిస్తున్నారా, ఏం లేదు సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వని అమ్మాయిని వధువుగా కావాలని కోరాడు. దాంతో నెటిజన్లు నీకు పెళ్లి అవ్వడం, నేను ప్రధాని కావడం రెండు ఒకటే అంటూ కామెంట్ చేస్తున్నారు.
నితిన్ సాంగ్వాన్ అనే ఐఏఎస్ అధికారి వధువు / వరుడు విషయంలో ఆలోచనలు మారుతున్నాయి అంటూ పేపర్‌లో వచ్చిన ఓ యాడ్‌ని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. పశ్చిమ బెంగాల్ కమర్పూర్‌కు వ్యక్తి ‘చటర్జీ 37/5’7” యోగా ప్రాక్టీషనర్, అందమైన, ఎటువంటి దురలవాట్లు లేని, హైకోర్టులో న్యాయవాది, పరిశోధకుడు.
తనకు ఇళ్లు, కారు ఉన్నాయి. తల్లిదండ్రులు ఉన్నారు. కమర్పుకుర్‌లో మరో ఇల్లు, కట్నం అడగని వరుడికి అందమైన, పొడవైన, సన్నని వధువు కావాలి, ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాకు బానిస కాకూడదు’ అంటూ ఇచ్చిన ఒక ప్రకటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు నీకు ఇక ఈ జన్మలో పెళ్లి కాదు అని కామెంట్ చేస్తుండగా మరి కొందరు మాత్రం ఇదేం వివక్ష, మహిళలకు సోషల్ మీడియా చూసే స్వేచ్ఛ కూడా లేదా అని మండి పడుతున్నారు.
మరి అతని కోరిక తీరుతుందా లేదా అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.