తెలంగాణ: లగచర్ల కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత అరెస్ట్
వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్‌పై లగచర్ల గ్రామంలో జరిగిన దాడి ఘటనలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద ఉదయం వాకింగ్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ దాడి వెనుక నరేందర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు అనుమానాలున్నాయని, ఆయనపై పలు ఆధారాలను సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
లగచర్ల ఘటనలో కీలక అనుమానితులు
లగచర్ల గ్రామంలో ఫార్మా సిటీ భూసేకరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో కలెక్టర్ ప్రతిక్ జైన్, కడా స్పెషల్ ఆఫీసర్, ఇతర ప్రభుత్వ అధికారులపై కొందరు స్థానికులు దాడి చేయడం సంచలనం రేపింది.
ఈ దాడిలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బీఆర్‌ఎస్ నేత బోగమోని సురేష్ ఆ రోజు నరేందర్ రెడ్డికి పలు కాల్స్ చేసినట్లు కాల్ డేటా ఆధారంగా తేలింది. ప్రస్తుతం సురేష్ పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఫార్మా సిటీ భూసేకరణపై ఉద్రిక్తత
వికారాబాద్ కలెక్టర్ ప్రజల అభిప్రాయ సేకరణ కోసం లగచర్ల గ్రామానికి వెళ్లిన సమయంలో, ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేసిన కొందరు రైతులు కలెక్టర్‌పై తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడినట్లు సమాచారం.
దుండగులు కలెక్టర్ ప్రయాణిస్తున్న వాహనాలను ధ్వంసం చేయడం ఆందోళన కలిగించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డీజీపీ ఆదేశాల మేరకు అదనపు డీజీ మహేష్ భగవత్ పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టారు.
నరేందర్ రెడ్డి అరెస్ట్ – రాజకీయ వర్గాల్లో కలకలం
పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దాడి ఘటనపై ప్రాథమిక విచారణ అనంతరం, నరేందర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు పుక్కిట ఆధారాలు సేకరించారు.
ఆతరువాత, కేసు విచారణను మరింత వేగవంతం చేస్తూ, నరేందర్ రెడ్డిని హైద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగిస్తూ, సురేష్ సహా ఇతర అనుమానితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.