తెలంగాణ: రాజకీయాల్లో కౌంటర్లు, రివర్స్ ఎటాక్‌లు కామనే. కానీ, ఇప్పుడు మాటలే కాదు చేతల్లోనూ రివర్స్ ఎటాక్ జరిగింది, అది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకింత షాకయ్యేలా. ఈ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
ఏం జరిగింది?
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే, ఒకసారి వెళ్లిన వారు వెనక్కి వచ్చిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. కానీ, తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే తిరిగి వెనక్కి వచ్చి మళ్లీ బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం సంచలనం.
గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. ఈ నెల మొదట్లో, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి, ఆయన పార్టీ మారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ పరిణామం బీఆర్ఎస్‌ను మరింత ఖాళీ చేస్తుందని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా తెరవెనుక ఏం జరిగిందో ఏమో, బండ్ల నేరుగా వచ్చి కేటీఆర్‌ను కలిసి మళ్లీ బీఆర్ఎస్ కండువా మార్చేశారు.
మారుతున్న రాజకీయ పరిణామాలు
ఇప్పటివరకు పదిమంది వరకు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది తమ పార్టీలోకి వస్తారని అధికార పార్టీ చెబుతోంది.
ఇలాంటి సమయంలో, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం గమనార్హం. ఇది బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.
ఎందుకిలా?
ఒకవైపు బీఆర్ఎస్‌ను కాపాడుకోవాలని బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఈ సమయంలో అనూహ్యంగా బండ్ల వెనక్కి రావడం బీఆర్ఎస్‌లో చేరడం వంటివి ఆశ్చర్యంగానే కాకుండా, కాంగ్రెస్‌లో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వచ్చేలా చేసింది.
మంత్రి పదవులపై ఆశలతో వెళ్తున్నారా? లేక ఇతర పదవుల కోసం వెళ్తున్నారా? అనేది ఒక చర్చ అయితే, వారికి ఆశించిన స్కోప్ కాంగ్రెస్‌లో కనిపించడం లేదని అందుకే వెనక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా, మున్ముందు బీఆర్ఎస్ నుంచి వెళ్లే నాయకులకు ప్రస్తుత ఘటన ఒక పాఠంగా మారుతుందని అంటున్నారు.
బీఆర్ఎస్ ట్వీట్
“ఇప్పుడు రాస్కోండి.. బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ అబ్బా అని. తిరిగి సొంత గూటికి చేరుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి పార్టీలో కొనసాగుతా అని తెలిపిన ఎమ్మెల్యే” అంటూ బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.