కొడంగల్: బీఆర్ఎస్ నేతకు 14 రోజుల రిమాండ్
తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు అయ్యారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై జరిగిన దాడిలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలతో, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ విధించగా, ఈ నెల 27 వరకు జైలుకు తరలించారు. ఈ ఘటనలో ఇప్పటికే 20 మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించగా, కేసు తాలూకు విచారణ ఇంకా కొనసాగుతోంది.
నరేందర్ రెడ్డి అరెస్టు వార్తల నేపథ్యంలో, అతని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ముందుకొచ్చింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తనతో పాటు బీఆర్ఎస్ నేతలు నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్య శృతి, తల్లిని భరోసా కల్పించారు.
కేటీఆర్‌ను చూసిన నరేందర్ రెడ్డి తల్లి కన్నీరు పెట్టుకోగా, కేటీఆర్ ఆమె పక్కన కూర్చొని భుజం తడుతూ ధైర్యం చెప్పిన సంఘటన భావోద్వేగం రేపింది.
కేటీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కేటీఆర్ తన పరామర్శలో “ఈ విపత్కర సమయంలో మీకు నా మద్దతు ఉంటుందని, అన్ని విధాలుగా ధైర్యంగా ముందుకు సాగాలని” అన్నారు.
నరేందర్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి తదితర నాయకులు కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి, వారితో మాట్లాడారు.
కేసు నడుమ బీఆర్ఎస్ శ్రేణులు నరేందర్ రెడ్డి అరెస్టును రాజకీయ కుట్రగా పేర్కొంటూ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
నరేందర్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ, ఈ చర్యలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు గట్టిగా మాట్లాడుతున్నారు.
రాష్ట్రంలోని రాజకీయ వాతావరణంపై ఈ కేసు తీవ్రమైన ప్రభావం చూపనుందని, త్వరలోనే ఈ విషయంపై మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.