సాయిరెడ్డిని మళ్ళీ తగులుకున్న బుద్దా వెంకన్న!
విజయవాడ: ఏపీ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న బుద్దా వెంకన్న, తాజాగా విజయసాయిరెడ్డి పైన మండిపడ్డారు. సెటిల్మెంట్ వ్యవహారం, శాంతి వ్యవహారం వంటి వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
శాంతి వ్యవహారంపై బుద్దా డిమాండ్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. దేవాదాయశాఖ ఉప కమిషనర్ శాంతితో నడిచిన డీల్ గురించి ప్రశ్నించారు. శాంతి భర్త చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ వ్యవహారం గురించి మీడియా పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా ప్రస్తావించారు.
కూటమిలో చిచ్చు పెడుతున్నారని ఆరోపణ
మంద కృష్ణమాదిగ వ్యాఖ్యలను వక్రీకరించి, కూటమిలో విభేదాలు రేపేందుకు విజయసాయిరెడ్డి ఎక్స్‌లో పోస్టు పెట్టారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ చేస్తున్న యత్నమని విమర్శించారు.
2027లో మళ్లీ ప్రభుత్వంలోకి వస్తామన్న సాయిరెడ్డి కలలు
2027లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని విజయసాయిరెడ్డి కలలు కంటున్నారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. జమిలీ ఎన్నికలపై చట్టం ఇంకా పాస్ కాలేదని, కేవలం ప్రతిపాదనల దశలో మాత్రమే ఉందని ఆయన గుర్తుచేశారు. వైసీపీ నుంచి పెరిగిన వలసలు ఆపేందుకు మాత్రమే సాయిరెడ్డి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ చిత్తశుద్ధిపై ప్రశ్నలు
బుద్దా వెంకన్న, షర్మిల చీర గురించి మాట్లాడిన సాయిరెడ్డిని ఇంకా పార్టీలో ఉంచిన వైసీపీ నాయకులకు బుద్ది ఉండాలన్నారు.