వాషింగ్టన్: ప్రపంచ ఐటీ దిగ్గజం అయిన మైక్రోసాఫ్ట్ తన సంస్థలో పని చేసే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనా వైరస్ మహమ్మరి వల్ల తమ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల 1,500 డాలర్లు( అంటే దాదాపు రూ.1.12 లక్షలు) సింగిల్ టైమ్ బోనస్ గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
కరోనా వైరస్ వల్ల కష్టాలతో గడిచిన ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో తమ ఉద్యోగులు చేసిన కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ (సీపీఓ), కాథ్లీన్ హొగన్ ఈ రోజు ఉద్యోగులకు ఈ సింగిల్ టైమ్ బోనస్ ను ప్రకటించారు. ఈ బోనస్ యుఎస్ మరియు అంతర్జాతీయంగా పనిచేస్తున్న తమ అర్హులైన ఉద్యోగులందరికీ వర్తిస్తుంది.
కాగా, ఈ బోనస్ మార్చి 31 2021కు ముందు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి దిగువన ఉన్న తమ సిబ్బంది అందరికీ బహుమతిగా అందించింది. ఇందులో పార్ట్ టైమ్ వర్కర్లకు కూడా అవకాశం కల్పించారు. మైక్రోసాఫ్ట్ సంస్థలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1,75,508 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థలైన లింక్డ్ ఇన్, గిట్ హబ్, జెనిమాక్స్ ఉద్యోగులకు ఈ బోనస్ కు అర్హులు కాదు.
ఈ బోనస్ అందించడం కోసం సుమారు $200 మిలియన్ల డాలర్లు కేటాయించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. క్రితంలో ఫేస్బుక్ తన 45,000 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి $1,000 బహుమతిగా ఇవ్వగా, అమెజాన్ ఫ్రంట్ లైన్ కార్మికులకు $300 సెలవు బోనస్, బీటీ గ్రూప్ తన 60,000 ఉద్యోగులకు £1,500(సుమారు $2,000) బహుమతిగా ఇచ్చాయి.