చెన్నై: భారత గడ్డపై రేపటుండి మొదలయ్యే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గురించి ఒక విషయం ఆసక్తి రేపుతుంది. అదేమిటంటే, ఇప్పటివరకు బుమ్రా టీమిండియా తరపున 17 టెస్టులకు ప్రాతినిధ్యం వహించగా, ఆ 17 టెస్టులన్నీ ఆడినది విదేశీ గడ్డపైనే అవడం విశేషం.
కాగా 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటివరకు 21 సగటుతో 79 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్ల ఉత్తమ ప్రదర్శన 5 సార్లు నమోదు కూడా చేశాడు. దానితో పాటు ఆడిన మొదటి ఏడాదిలోనే 8 మ్యాచ్‌ల్లో 48 వికెట్ల అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రా, ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇదిలా ఉండగా రేపు ఇంగ్లండ్‌తో జరగబోయే తొలి టెస్టు మ్యాచ్‌తో బుమ్రా స్వదేశంలో తొలి టెస్టు ఆడనుండడం ఇప్పుడు ప్రత్యేకతను చాటుకుంటోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటికే స్వదేశంలో తనదైన మార్క్ చూపిన బుమ్రా టెస్టులో తన ముద్రను ఎలా వేయబోతున్నాడనేది తేలనుంది.
ఈ నేపథ్యంలో బుమ్రా ఫోటోను షేర్ చేస్తూ ఐసీసీ తన అధికార ట్విట్టర్ అకౌంట్ లో ఒక ట్వీట్ చేసింది. 17 మ్యాచ్‌ల్లోనే 79 వికెట్లు తీసిన బుమ్రా ఇండియాలో తొలి టెస్టు ఆడనున్నాడా అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ ఒక ఎమోజీని పెట్టింది. కాగా ఆసీస్ తో జరిగిన మూడో టెస్టులో గాయపడిన బుమ్రా గబ్బాలో జరిగిన నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. బుమ్రా, షమీ లాంటి సీనియర్ బౌలర్ల గైర్హాజరీలో టీమిండియా ఆఖరి టెస్టు మ్యాచ్‌ను గెలిచి 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది.