ముంబై: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు అందుబాటులో ఉండడంపై ప్రశ్నార్థక పరిస్థితి కొనసాగుతోంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో వెన్నునొప్పి సమస్య తలెత్తిన నేపథ్యంలో, బుమ్రా న్యూజిలాండ్ ఆర్థోపెడిక్ సర్జన్ రోవాన్ సచౌటెన్‌ను సంప్రదించినట్టు సమాచారం. బీసీసీఐ మెడికల్ టీమ్ పరిస్థితిని సమీక్షించి తుది నివేదిక ఇవ్వనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో బుమ్రా పేరును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, అతను పూర్తిగా ఫిట్‌గా ఉంటేనే ఎంపిక చేస్తారని తెలుస్తోంది. బుమ్రా ఫిట్‌నెస్ పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం బౌలింగ్‌పై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, కెప్టెన్సీ బాధ్యతలు బుమ్రా ఫిట్‌నెస్‌ను దెబ్బతీస్తాయని హెచ్చరించాడు.
బుమ్రా వికెట్లపై దృష్టి పెట్టడం మంచిదని, బీసీసీఐ ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించాడు.