టాలీవుడ్: కరోనా కారణంగా ఇన్ని రోజులుగా థియేటర్లు మూత పడినా కూడా డిసెంబర్ 20 నుండి తెలుగులో విడుదలవుతున్న సినిమాల జోరు వార వారానికి పెరుగుతుంది. అంతే కాకుండా జనాలు కూడా సినిమాలని థియేటర్లలో చూస్తూ విడుదలవుతున్న అన్ని సినిమాలని ఆదరిస్తున్నారు. క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు సినిమాల సూపర్ సక్సెస్ దీనికి నిదర్శనం. సంక్రాంతి నుండి ప్రతీ వారం దాదాపు నాలుగు నుండి ఐదు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఎంత కాదన్నా అందులో రెండు నుండి మూడు సినిమాలు కొంచెం పేరున్న హీరోలవో, పేరున్న ప్రొడక్షన్ హౌసెస్ నుండో విడుదల అవుతున్నాయి.
ఈ వారం RX100 హీరో కార్తికేయ గీతా ఆర్ట్స్ వారి GA2 పిక్షర్స్ బ్యానర్ పై ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో శవాలని మోసుకెళ్లే వాహన డ్రైవర్, తన భర్త ని చివరి చూపు చూడడానికి వచ్చిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని ప్రేమించే పాత్రలో నటిస్తున్నాడు. ఒక కొత్త రకమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందిందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా రేపు థియేటర్లలో విడుదల అవుతుంది.
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ అక్క తమ్ముల్లుగా మరియు నవీన్ చంద్ర, నవదీప్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో రూపొందిన ‘మోసగాళ్లు’ అనే సినిమా రేపు విడుదల అవుతుంది. ఒక పెద్ద IT స్కామ్ నేపథ్యం లో ఈ సినిమా రూపొందింది. ఒక మామూలు మధ్య తరగతి వ్యక్తి దేశంలో ఒక పెద్ద స్కామ్ ఏమి చేసాడు , ఎలా చేయగలిగాడు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది.
ఆది హీరోగా, సురభి హీరోయిన్ గా ‘శశి’ అనే ఒక సినిమా రూపొందింది. లవ్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా కూడా రేపే విడుదలవుతుంది. తనని ఎంతగానో ప్రేమించే అమ్మాయి ఒక అనుకోని ఆక్సిడెంట్ వలన తనని మర్చిపోతే అలాంటి బాధలో హీరో ఎలా తన ప్రేమని దక్కించుకున్నాడు అనేది సినిమా కథ అని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.
ఇవే కాకుండా ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే మరో సినిమా కూడా విడుదలవుతుంది. దాదాపు మంచు విష్ణుకి, కార్తికేయ కి, ఆది కి సక్సెస్ లో కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ సినిమాలతో వీళ్ళు కం బ్యాక్ అవుదామని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలు సక్సెస్ బాటలో నిలిచి ఈ హీరోలకి సక్సెస్ తో మంచి దారి చూపాలని ఆశిద్దాం.